ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్.. ఇలా ప్రజా శ్రేయస్సు కోరే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలోనే నిజమైన ప్రజా సేవ ఉన్నదని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామ చౌరస్తాలో బుధవారం మండలంలోని 39 మంది లబ్ధిదారులకు రూ.29 లక్షల 29వేల 524 రూపాయల మేర కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గారు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామని, ఆ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి వివరించారు. రైతు అభ్యున్నతి కోసం దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని, ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం కింద ఎకరాకు 4వేల ఆర్థిక పెట్టుబడి సాయం రైతులకు అందించారని, అలాగే ప్రతి రైతుకు రూ.5లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేశారని చెప్పారు. రైతుబీమాను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని రైతులను మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, నంగునూరు తహశీల్దారు విజయ భాస్కర్ జీ, ఇతరులు ఉన్నారు.