గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ది రేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకటించారు. 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ (రాష్ట్ర స్వీయ ఆదాయం) మిగతా రాష్ట్రాలకంటే ముందంజలో ఉందని కంప్ర్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెబ్ సైట్లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్ నెల నుంచి 2018 మే వరకు వివరాలను సిఎజి ప్రకటించింది.
see also:బోనాల పండుగకు రూ.15 కోట్లు..!!
మొత్తం నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం 17.2 శాతం వృద్ధి రేటు సాధించి మొదటి స్థానంలో నిలవగా, హర్యానా (14.2 శాతం), మహారాష్ట్ర(13.9శాతం), ఒడిస్సా (12.4శాతం), పశ్చిమ బెంగాల్ (10.3 శాతం) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ 10 శాతం లోపు వృద్దిరేటు సాధించాయి. తెలంగాణ రాష్ట్రం 2015-16లో 13.7 శాతం, 2016-17లో 21.1 శాతం, 2017-18లో 16.8 శాతం వృద్దిరేటు సాధించాయి.
see also:అసత్య ప్రచారం.. టీచర్లు నమ్మొద్దు..కడియం
తెలంగాణ రాష్ట్రం అవలంభిస్తున్న ప్రగతి కాముక ఆర్థిక విధానాలకు, పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణకు, పన్నుల చెల్లింపులో ప్రజలు చూపిస్తున్న చిత్తశుద్ధి వల్లనే ఆదాయాభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడానికి కారణాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే డి మానిటైజేషన్, జిఎస్టి లాంటి నిర్ణయాల తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం సుస్థిరమైన ఆదాయాభివృద్ధితో ఆర్థిక ప్రగతి సాధించడం శుభసూచకమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత బాగా అమలు చేసుకోవడానికి ఆదాయాభివృద్ధి ఎంతో దోహదపడుతుందని సిఎం అన్నారు.