Home / EDITORIAL / బడి అంటే చదువే కాదు. అది మన బాల్యపు జీవితం.

బడి అంటే చదువే కాదు. అది మన బాల్యపు జీవితం.

నా చిన్నప్పుడు ఊరిలో బడి పక్కనే పాడుబడిన పెద్ద బాయిబొంద ఉండేది. బడికి వచ్చే పిల్లలు ఎక్కడ బాయిలో పడతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అంతలో బడికి కొత్తగా ఒక హెడ్‌ మాస్టరు వచ్చిండు. ఒక రోజు ఆయన పిల్లలను పిలిచి, ఆదివారం నాడు అందరూ పాత బట్టలు వేసుకుని, గడ్డపార, పార తీసుకుని బడికి రావాలన్నడు. పిల్లలు గడ్డపార, పార తీసుకుని బడికి పోతుంటే, ఇదేందని వెంట తల్లిదండ్రులు కూడా వచ్చారు. ‘పొరపాటున పిల్లలు ఈ బాయి బొందల పడితే చచ్చిపోతరు. అందరం కలిసి పూడుద్దామా’ అని అడిగిండు పెద్ద సారు. సరే అంటే సరే అనుకున్నరు. పెద్దవాళ్లు గడ్డ పారలతో పక్కనే ఉన్న దిబ్బను తవ్వితే.. రామదండులా పిల్లలు తట్టలందుకుని మట్టి తీశారు. టీచర్లూ తలో చేయి వేశారు. అంత పెద్ద బాయి బొంద మధ్యాహ్నానికల్లా పూడిపోయింది. ఈ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఇలాంటి అనుభవాలు నాకే కాదు.. మీ అందరికీ ఉండి ఉంటాయి. ఎందుకంటే, మనమంతా అలాంటి మామూలు ఊర్ల నుంచి వచ్చిన వాళ్లమే. అక్కడున్న సాదాసీదా సర్కారీ బళ్లలో చదువుకున్న వాళ్లమే. బడి అంటే చదువే కాదు. అది మన బాల్యపు జీవితం. ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం ప్రభుత్వానికి సంబంధించినవి మాత్రమే కావు. అవి ఊరి ప్రజల ఉమ్మడి ఆస్తి. తరాల అంతరాలను పూడుస్తూ సగర్వంగా నిలిచే వారసత్వ చిహ్నాలు. మనలను వేలు పట్టి బాల్యంలోకి నడిపించే తీపి జ్ఞాపకాలు. మన పిల్లలను గౌరవనీయ ఉన్నత శిఖరాలకు పంపిన విజయ సోపానాలు. మన ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించిన ఉద్యోగ కేంద్రాలు. మన సామూహిక సామాజిక ప్రగతికి చెరగని గురుతులు. అలాంటి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైనా ఉంది.

సామాజిక బాధ్యత
చరిత్ర చదవడమే కాదు. చరిత్ర సృష్టించాలి. బడే ఇందుకు వేదిక. పేరు ప్రభుత్వ పాఠశాల అయినంత మాత్రాన వాటికి సంబంధించిన అన్ని పనులనూ ఒక్క ప్రభుత్వమే చేయలేదు. అలా చేయాలని అనుకోవడమూ సరికాదు. పాఠశాలలకు ప్రభుత్వం భవనాలు కట్టిస్తుంది. ఉపాధ్యాయులను నియమిస్తుంది. వాళ్లకు జీతాలు ఇస్తుంది. ప్రభుత్వం నిధులు ఇస్తూ తన విధిని నిర్వర్తిస్తుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరవాత కేసీఆర్‌ ప్రభుత్వం విద్య విషయంలో మరెన్నో అడుగులు ముందుకు వేసింది. తెలంగాణవ్యాప్తంగా వివిధ కులాలు, వర్గాలకు పెద్దయెత్తున గురుకులాలను ఏర్పాటు చేసింది. వాటిలో నాణ్యమైన ఇంగ్లిషు విద్యను అందిస్తున్నారు. ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా గురుకులాలు దూసుకెళుతున్నాయి. చక్కటి నైపుణ్యం గల ఉపాధ్యాయుల అండదండలతో ఇతర ప్రభుత్వ పాఠశాలలూ అద్భుతంగా పనిచేస్తున్నాయి. సిద్ధిపేట ఇందిరానగర్‌ తదితర కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంది. తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా సానుకూల పరిస్థితిని విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చాలావరకు చదివేది పేద పిల్లలే. వారిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావడంలో ప్రభుత్వంతో పాటు సమాజానికీ అంతే బాధ్యత ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఒక స్థాయికి చేరిన మనం ఆ పాఠశాలకు ఇప్పుడు ‘ఫీజు’ కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దీనినే ‘గివ్‌ బ్యాక్‌ టు ద సొసైటీ’ (సమాజానికి తిరిగి ఇవ్వడం) అని అంటున్నా- మన భాషలో పుట్టిన ఊరు, చదివిన పాఠశాల రుణం తీర్చుకోవడమే!

ఊరి పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం అనేది ఒక నైతిక బాధ్యత. స్కూలు నిర్వహణకు డబ్బులు ఇవ్వడం, భవనం కట్టించడం వంటివి మాత్రమే బాధ్యతలు కాబోవు. రుణం తీర్చుకోవడం అంటే కేవలం పైసలివ్వడమే కాదు. బాధ్యత అంటే కేవలం ఒకసారి సేవ చేసి వదిలేయడం అంతకన్నా కాదు. ఎవరికి ఏ రకమైన శక్తి, ఎంత స్థాయి ఉంటే అదే పద్ధతిలో సహకారం అందించవచ్చు. ఇప్పటికే ఎంతోమంది ఇటువంటి ఉదాత్త కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారు. విదేశాల్లో ఉంటున్న తెలంగాణవాసులు తమ తమ ఊళ్లను, పాఠశాలలను ఎంతో ఉత్సాహంగా బాగు చేసుకుంటున్నారు. హన్మకొండలో ఎస్‌ఆర్‌ విద్యా సంస్థల అధినేత ఎనగందుల వరదారెడ్డి తన సొంత ఊరైన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటను ‘ఎడ్యుకేషన్‌ హబ్‌’గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు. అక్కడ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి నాలుగు ఎకరాలను విరాళంగా ఇచ్చారు. అవసరమైతే ఇంకా ఎక్కువ స్థలం ఇచ్చేందుకూ సంసిద్ధత ప్రకటించారు. పాఠశాలకు ఫర్నిచర్‌; విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్కులు సమకూర్చారు. తమ విద్యా సంస్థల్లో చదివే దమ్మన్నపేట విద్యార్థులకు ఫీజులో 50 శాతం రాయితీ అందిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన రాజేశ్వర్‌ రెడ్డి ఏటా విద్యార్థులకు యూనిఫారాలు, నోట్‌ బుక్కులు ఉచితంగా ఇస్తారు. మరికొంతమంది స్కాలర్‌ షిప్పులు అందజేస్తున్నారు. మరొక ఎన్నారై పదుల సంఖ్యలో పేద విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారు.

పాఠశాలలకు పట్టం కట్టాలి
కాస్తో కూస్తో ఉన్నవాళ్లు డబ్బులు ఇస్తున్నారు. మరి డబ్బు లేనివాళ్ల సంగతేమిటి? సమయం ఉన్నవాళ్లు సమయం ఇవ్వవచ్చు. నైపుణ్యం ఉన్నవాళ్లు తమ నైపుణ్యాన్ని అందించవచ్చు. వస్తువులు ఉన్నవాళ్లు వస్తువులు ఇవ్వవచ్చు. స్కూల్లో ఒక కంప్యూటర్‌ ల్యాబ్‌ కట్టించవచ్చు. మరుగుదొడ్లు కట్టించవచ్చు. ఆర్వో ప్లాంట్లు, మంచినీటి సౌకర్యం వంటివి కల్పించవచ్చు. క్రీడలను ప్రోత్సహించవచ్చు. భవనం నిర్మించి ఇవ్వవచ్చు. బెంచీలు అందించవచ్చు. ప్రతి ఊర్లోనూ చదువుకున్న యువకులు, చదువు వచ్చిన ఇల్లాళ్లు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు ఎంతోమంది ఉంటారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల్లో విషయ నిపుణులకు కొదవుండదు. వీరంతా పాఠశాల ప్రగతిలో భాగస్వాములు కావచ్చు. ఇందుకోసం వారు ఉపాధ్యాయులు, స్కూలుతో సామరస్యపూర్వక సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు ఉన్నా కొన్ని చోట్ల నిపుణుల కొరత ఇబ్బంది పెడుతోంది. సాధారణంగా విద్యార్థులు ఇంగ్లిషు, లెక్కల సబ్జెక్లుల్లో వెనకబడుతూ ఉంటారు. అలాంటి చోట్ల వారానికో క్లాసు చెబుతామని ప్రతిపాదించవచ్చు. లేకపోతే పిల్లలు ఏయే సబ్జెక్టుల్లో వెనకబడ్డారో తెలుసుకుని వారికి ఆయా అంశాల్లో ప్రత్యేక తరగతులు చెప్పవచ్చు. దానివల్ల వాళ్లు పిల్లలతో మరింత కాలం గడపవచ్చు. చదువు చెప్పామన్న ఆత్మ సంతృప్తి సైతం వారికి లభిస్తుంది. ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకుని వారు పిల్లలకు ఒక క్లాస్‌ తీసుకోవచ్చు. అది కుదరకపోతే సాయం సమయాల్లో పిల్లలను చదివించవచ్చు. దీనివల్ల వారికి కాలక్షేపంతో పాటు, పేద పిల్లలకు ఉపయోగపడినట్టూ అవుతుంది. ఇంతే కాదు ఇంటి చుట్టుపక్కల ఒక పిల్లగాడు సరిగ్గా స్కూలుకు వెళ్లడం లేదంటే… వాడిని పాఠశాలకు వెళ్ళేలా చేయడమూ నైతిక బాధ్యతే. అలాగే, పాఠశాలలో విద్యా నాణ్యతపై దృష్టి పెట్టడం కూడా ఊరి బాధ్యతే. ఏదైనా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలను స్కూలుకు పంపించలేని పరిస్థితుల్లో ఉంటే అలాంటి పిల్లలను దత్తతకు తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఆ పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగితే చిన్నారిప్రాయంలో తమకు చేయందించినవారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు! అలాగే ఊళ్లో డీఎస్సీ పూర్తి చేసిన నిరుద్యోగి ఉన్నాడనుకోండి. అతడికి ఇంగ్లిషులోనో, లెక్కల్లోనో మంచి పరిజ్ఞానం ఉంటే- నెల జీతాన్ని భరించి అతడితో పిల్లలకు చదువు చెప్పించడాన్ని సైతం బాధ్యతగా స్వీకరించవచ్చు. చదువుల్లో వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని వారిని ఆణి ముత్యాలుగా తీర్చిదిద్దే బాధ్యతను విద్యావంతులు, రిటైర్డ్‌ టీచర్లు తీసుకోవాలి. మనసుంటే మన గ్రామాల్లో పాఠశాలల రూపురేఖలను అద్భుతంగా తీర్చుదిద్దుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

తలో చేయి వేస్తేనే సత్ఫలితాలు
నేను ఇటీవల ఒకటి రెండు పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు పిల్లల్లో ఆశించిన స్థాయి ప్రతిభ కనిపించలేదు. ఇది ఆ విద్యార్థుల తప్పు కాదు. ఇందులో ఉపాధ్యాయుల పొరపాటు కూడా ఏమీ లేదు. ఇందుకు లోతైన కారణాలున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నవారిలో పేద పిల్లలే ఎక్కువ. విద్యార్థుల్లో ప్రతిభ కనిపించకపోవడానికి వారి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, సామాజిక వెనకబాటుతనం వంటి ఎన్నో కారణాలున్నాయి. ఒక విద్యార్థి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఆరు సబ్జెక్టుల్లో వచ్చే మార్కుల ద్వారా సహేతుకంగా మదింపు చేయడం సమంజసమేనా అన్న విషయం పైనా లోతైన చర్చ అవసరం. చదువులో రాణించకున్నా క్రీడలు, ఇతర విషయాల్లో నైపుణ్యం చూపే పిల్లల సామర్థ్యాలను ఎలా పసిగట్టాలి? ఎలా పరీక్షించాలి? అలా చేసినప్పుడే కదా… మరింత మంది మాలావత్‌ పూర్ణలు, నికత్‌ జరీనాలు బయటకు వచ్చేది! ఈ విషయంలోనూ మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న పేద పిల్లలకు కనీస విద్య అందించడం మనందరి బాధ్యత. తెలంగాణలోని కొన్ని స్కూళ్లలో పదో తరగతి వరకూ 100 శాతం పాసవుతున్నారు. ఆ తరవాత వారంతా పక్కనే ఉన్న కాలేజీకి వెళుతున్నారు. అక్కడ ఉత్తీర్ణత కేవలం 38 శాతంగా మాత్రమే ఉంటోంది. ఇందుకు కారణం పాఠశాల స్థాయిలో విద్య నాణ్యత దెబ్బతినడమే. వంద శాతం ఫలితాలు రావాలనే లక్ష్యం వెనక ఉద్దేశం పిల్లలకు చదువు నేర్పడమే తప్ప, నేర్పకుండా పాస్‌ చేయడం కాదు. చదువు రాలేదని ఫెయిల్‌ చేయవద్దు, చదువు రాకున్నా పాస్‌ చేయవద్దు. చదువు నేర్పి పాస్‌ చేయాలి. ‘మా గురువుగారు ఫలానా… ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాన’ని చెప్పే వాళ్లను మనం ఇప్పుడు ఎంతోమందిని చూస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికీ స్వయంగా తన గురువుకు పాదాభివందనం చేస్తారు. ఒక విద్యార్థిని ఆదరించి మంచిగా చదువు చెప్పి పైకి తీసుకొస్తే ఆ గురువును జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు. కానీ, ఇప్పటి చదువులు ఇదివరకటిలా లేవు. ఇప్పుడున్నది పోటీ ప్రపంచం. ఇప్పుడు మన ఊరితో కాదు.. మొత్తం ప్రపంచంతోనే పోటీ పడాల్సిన పరిస్థితి. ఐఐటీ, నీట్‌ ఇలా ఇప్పుడు ఏ పరీక్ష చూసుకున్నా అవి జాతీయ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఇక ఉద్యోగ పోటీ పరీక్షల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇంతటి పోటీ వాతావరణానికి మన పిల్లలను సంపూర్ణ సామర్థ్యంతో సిద్ధం చేయడం- అది కేవలం ఉపాధ్యాయులు, ప్రభుత్వం మాత్రమే నిర్వర్తించే బాధ్యత కాదు. సమాజం మొత్తం అందుకు దన్నుగా నిలవాలి. ఊరి బడికి, ఆ బడిలో చదువుకుంటున్న పిల్లలకు అండదండ కావాలి. ఊర్లోని ప్రజా ప్రతినిధులు, విద్యాధికులు, యువకులు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ఆ ఊర్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో, పదవుల్లో ఉన్న వారు ముందుకు కదలాలి. ఒక జట్టుగా సమన్వయంతో, పరస్పర సహకారంతో ఊరి బడికి, అందులో చదువుకుంటున్న పేద పిల్లలకు చేదోడువాదోడుగా నిలవాలి. ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ (చదువుకున్న ప్రతి ఒక్కరూ మరొకరికి విద్య నేర్పడం) కార్యక్రమంలో ఎవరికి వీలైన రీతిలో వారు పాలుపంచుకోవాలి. విద్యాదానమే మహాదానం. ఊరు బాగుపడితేనే కదా రాష్ట్రమైనా, దేశమైనా బాగుపడేది!
బడి… మన బాధ్యత
-హరీష్ రావు గారు(తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat