ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు అనుచరుడిగా వ్యవహరించిన లైసెన్సెడ్ సర్వేయర్ సీహెచ్.గోవిందరాజులు ఇంట్లో మంగళవారం ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐ గణేష్‌తో పాటు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆశీలు మెట్టలో గల గోవిందరాజులు ఇంట్లో పలు కీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్‌పీఎస్ ఇన్‌ఫ్రా అనే కంపెనీని రఘు కుటుంబసభ్యులతో కలిసి గోవిందరాజులు ఏర్పాటు చేసినట్లు గుర్తించామన్నారు. రఘు అత్త భసివిరెడ్డి కళావతమ్మకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఓ కంపెనీలో కళావతమ్మకు 16.67 శాతం వాటాతో కూడిని ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరులో 6 ఎకరాల స్థలంతో పాటు అనంతపురం జిల్లా గోరంట్లలో 75 ఎకరాల స్థలం ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మంగళవారం ఒక్కరోజే రూ.3కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ.10కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా గోవిందరాజులకు సంబంధించి పలు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను తెరవగా 770 గ్రాముల బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించామని తెలిపారు. అయితే వీటి కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలు చూపించడంతో వాటిని తిరిగి అప్పగించేశామని డీఎస్పీ తెలిపారు.