రెండేళ్ల ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాటిన హరితహరం మొక్క నేడు వృక్షమై శ్రీ వేంకటేశ్వరస్వామి పూజకు పత్రాలు, పుష్పాలు అందిస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి ఉపయోగపడడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు దోహదపడుతున్నది. అటవీ ప్రాంతాల్లోనే కాకుండా జనావాసాల్లో, గుడులు, మసీదులు, చర్చి ప్రాంగణాల్లో కూడా మొక్కలు నాటాలనే సంకల్పం నెరవేరుతున్నది. 2015 జూలై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిలుకూరు బాలాజి దేవాలయంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించి దేవాలయ ప్రాంగణంలో మొదటి మొక్కగా సంపెంగ మొక్కను నాటారు. ఇప్పుడా మొక్క పెరిగి పుష్పాలను అందిస్తున్నది . ప్రతీరోజు జరిగే పూజలోఈ చెట్టు ద్వారా సంపెంగ పూలు, ఆకులను వినియోగిస్తున్నారు. ముఖ్యమంత్రి మొక్క నాటిన దగ్గరి నుంచి క్రమం తప్పకుండా ఆలయ పూజారులు నీళ్లు పోసి పెంచుతున్నారు. అర్చనలో ఇదే చెట్టు పూలు, పుష్పాలు వాడుతున్నారు. కేవలం ముఖ్యమంత్రి నాటిన మొక్కే కాకుండా అదే రోజు మంత్రులు, ఇతర ప్రముఖులు నాటిన మొక్కలన్నీ కూడా మంచిగా నాటుకున్నయి, పెరిగి పెద్దవి అవుతున్నయి.
ఈ మొక్కలతో గుడి ప్రాంగణమంతా ఉద్యానవనాన్ని తలపిస్తున్నది. ఆహ్లాదకర వాతావరణంతో దైవ సన్నిధి ప్రభ ద్విగుణీకృతమవుతున్నది. అటవీ శాఖాధికారులు కూడా ఎప్పటికప్పుడు మొక్కల సంరక్షణ బాధ్యతలను నెరవేరుస్తున్నరు. ముఖ్యమంత్రి నాటిన సంపెంగ మొక్క ద్వారా వచ్చిన పత్రాలు, పుష్పాలు పూజా కార్యక్రమాల్లో వినియోగించడం తమకు గొప్ప అనుభూతినిస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. ముఖ్యమంత్రి నాటిన మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేశామని, ప్రతిరోజు నీళ్లు పోస్తున్నామన్నారు. మొక్క నాటింది ముఖ్యమంత్రి కేసిఆర్ కావడంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సంపెంగ మొక్కను చూసి స్పూర్తి పొందుతున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునందుకుని ఇప్పటికే చాలా దేవాలయాల్లో, ఇతర ప్రార్థనా మందిరాల్లో మొక్కలు నాటారన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెరుగుతున్న మొక్క పత్రాలు, పుష్పాలు అందించడంతో పాటు సువాసనలు వెదజల్లుతున్నదని వెల్లడించారు. దీనిని స్పూర్తిగా తీసుకుని అన్ని దేవాలయాల్లో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. త్రికరణ శుద్ధితో చేసిన మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తప్పక వుంటుందనడానికి తెలంగాణకు హరిత హారం గొప్ప నిదర్శనమని రంగరాజన్ అన్నారు.