కేసీఆర్ దయవల్ల జిల్లా వచ్చినందున తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికి విజయవంతం చేయాలి అని మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 11న సిరిసిల్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకుని ఆదివారం మంత్రి కేటీఆర్ బైపాస్‌రోడ్డులోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంతో పాటు సీఎం సభా స్థలి కోసం స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అనంతరం పొదుపు భవనంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. సీఎం రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని, పట్టణంలో సభ నిర్వహిస్తున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూచించారు.
ఈ నెల 11న ( బుధవారం ) ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయలు దేరి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలో ముఖ్య మంత్రి పర్యటిస్తారని తెలిపారు. సిద్దిపేటలో మెడికల్ కళాశాలతో పాటు కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేస్తారని, కేసీఆర్ పర్యటన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కొత్త జిల్లాలలో జిల్లాల ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని కొత్త కలెక్టరేట్లకు సంబంధిత మంత్రులు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్య మంత్రి చేతుల మీదుగా కలెక్టరేట్ భవన నిర్మాణంతో పాటు, రూ.30 కోట్లతో నిర్మిస్తున్న అపెరల్ పార్కు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా కోనరావుపేట మండలం మల్కపేట మూడు టీఎంసీల రిజర్వాయర్‌కు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయి మహిళా కార్మికులు ఉపాధి కోల్పోతున్నందున వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు సిరిసిల్లలో అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పార్కు ద్వారా సుమారు 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు లేబర్ కం ఓనర్ (కార్మికుడే యజమాని) కావాలన్న పథకాన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు ఇచ్చిన ఘనత తెలంగాణ సర్కారుదేనన్నారు. గోదావరి జలాలతో ఇంటింటికీ తాగునీరు డిసెంబర్‌లో అందిస్తామని పునరుద్ఘాటించారు. కాళేశ్వర ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని, సీఎం ప్రత్యేక చొరవతో మధ్యమానేరును నాలుగు టీఎంసీల నీటిని తెప్పించారని గుర్తుచేశారు. త్వరలో నల్లా నీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మధ్యమానేరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగు, తాగునీరందించే బృహత్తర కార్యక్రమమని, వాటి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మల్కపేట రిజర్వాయర్ మూడు టీఎంసీల సామర్థ్యం గలదని, దీని ద్వారా మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కానున్నదని, ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.