అజంజాహీ మిల్లును తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, కాజీపేట ఆర్వోబీ,శంకుస్థాపన, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన చేయించుకున్నందుకు వరంగల్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలో చాలా చోట్ల వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి కానీ, వాటన్నింటిని తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది చేనేత కార్మికులు అహ్మదాబాద్, సూరత్, బివండిలకు వలస పోయారని, కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ నిర్మాణంతో వారందరూ తిరిగి వచ్చి ఇక్కడే పనులు చేసుకుని జీవించేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
సూరత్‌లో మహిళలు ధరించే వస్త్రాలు.. తమిళనాడులో అండర్ గార్మెంట్స్.. షోలాపూర్‌లో దుప్పట్లు, రగ్గులు తయారువుతాయని, అయితే వరంగల్‌లో నిర్మించనున్న కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ మాత్రం ఆ మూడింటి కలయికేనని సీఎం కేసీఆర్ అన్నారు. భారత దేశంలోనే కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ అతి పెద్దదన్నారు కేసీఆర్. అన్ని రకాల వస్తువులు దొరికే ప్రాంతంగా వరంగల్ కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ ఉండబోతోంది.. అలాగే అతి త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టును తయారు చేస్తామన్నారు.