గతంలో తన మొదటి పెళ్లి గురించి లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను ఎన్టీఆర్ జీవితంలోకి రావడంపై చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఏ మనిషినీ పూర్తిగా మంచి అని కానీ, లేదా చెడు అని గానీ అనం.. ఇది సహజమే’ అన్నారు.‘మీ మొదటి భర్త మిమ్మల్ని బాగా చూసేవారని అంటుంటారు. ఎంతవరకు వాస్తవం?’ అనే ప్రశ్నకు లక్ష్మీపార్వతి సమాధానమిస్తూ, ‘నిజం చెప్పాలంటే, నా మొదటి పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. అనుకోని పరిస్థితుల్లో అయిన పెళ్లి అది. మా అమ్మానాన్నలు కూడా ఆ పెళ్లిని తిరస్కరించారు. మాకు ఒక కొడుకు పుట్టిన తర్వాత, నా భర్త, నేను దూరమయ్యాం. విభేదాల కారణంగా మేము విడిపోయాం. ఆ తర్వాత, నేను ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయా’ అని అన్నారు.
‘నాడు ఎన్టీఆర్ చాలా గట్టిగా ప్రయత్నించడం వల్లే మా పెళ్లి జరిగింది. మా పెళ్లి అయిపోయిన వెంటనే మాపై రాజకీయాలు మొదలయ్యాయి. ‘లక్ష్మీపార్వతి వచ్చిందిగా తెలుగుదేశం పార్టీ గెలవదు’, ‘ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు గనుక ప్రజలు అంగీకరించడం లేదు’, ‘ప్రజలందరూ చాలా కోపంగా ఉన్నారు’, ‘ఆడవాళ్లయితే ఇంకా కోపంగా ఉన్నారు’ అనే పుకార్లు వచ్చేవి. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారనే విషయం మాకు అర్థమయ్యేది కాదు’ అన్నారు లక్ష్మీ పార్వతి.‘తెల్లవారిన తర్వాత పేపరు చూడాలంటే భయమేసేది.ఎన్టీఆర్ అయితే అసలు పేపర్ చూసే వారు కాదు! నాకేమో పేపర్ చదివే అలవాటు. పేపర్ చదివి నేను బాధపడేదాన్ని. నేను బాధపడుతుంటే..‘ఏమైంది పేపర్ చదివావా?’అని ఆయన అడిగేవారు. ‘అవును’ అని నేను సమాధానం చెబితే.. ‘ఆ పేపర్ పక్కన పడెయ్. లేకపోతే, నీ బుర్ర పాడైపోతుంది’ అనేవారు.
మేం పెళ్లి చేసుకున్నాం కనుక టీడీపీ ఓడిపోతుందనే ప్రచారం మొదలైంది. నిజం చెప్పాలంటే.. ఈ ప్రచారానికి భయపడిన వాళ్లెవ్వరూ లేరు. అదంతా ఒక నటన, నాటకం. ఈ నాటకానికి కారణం మా చిన్నఅల్లుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబునాయుడి కుట్ర ఎలా మొదలైందనే విషయం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ‘తెలుగు తేజం’లో నేను రాశాను. ఎన్టీఆర్ జీవితంలోకి నేను ప్రవేశించక ముందు నుంచే ఆయన పదవిని తీసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నాడు.ఈ మాట నేను చెబుతున్నది కాదు. ఎన్టీఆర్ గారే చెప్పారు. నాతోనే కాదు, ప్రజల ముందే ఆయన స్వయంగా చెప్పారు. 1995 ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు కాకుండా చంద్రబాబునాయుడు పదవిలోకి రావాలని కుట్ర. ఎందుకంటే, అంతకుముందు నుంచే ఓ పత్రికాధిపతికి, ఈయన (ఎన్టీఆర్)కు పడటం లేదు. తన చెప్పుచేతల్లో ఉండే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆ పత్రికాధిపతి ప్లాన్ వేశారు’ అని చెప్పుకొచ్చారు లక్ష్మీపార్వతి.