సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయటానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రప్రభుత్వాన్ని కోరనునున్నారు. రేపు ధిల్లీ లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశం లో మంత్రి హరీష్ పాల్గొననున్నారు. ఈ మేరకుఈ రోజు సెక్రెటేరియట్ లో ఉన్నతాధికారులతో హరీష్ రావు సమీక్షించారు. ఎస్.ఆర్. ఎస్.పి కింద31 కోట్లు, రాజీవ్ భీమా కింద 108 కోట్లు వెంటనే ఇవ్వాలని కేంద్రన్ని మంత్రి కోరారు.
దేవాదుల కు 470 కోట్లు, నీల్వాయి కి 67 లక్షలు, మత్తడి వాగు కోసం 2.6 కోట్లు, జగన్నధాపూర్ ప్రాజెక్టుకు 32 కోట్లు, గొల్లవాగు కోసం 2 కోట్లు గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధుల వ్యయానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని సంబంధిత సి.ఇ లను మంత్రి కోరారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(పీఎంఎస్‌కేవై) కింద దేశవ్యాప్తంగా ప్రాధాన్యంగా పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణాలోని 11 ప్రాజెక్టులు ఉన్నాయి . ఈ ప్రాజెక్టులకు పీఎంఎస్‌కేవైలో చోటు లభించేలా చేయడానికి మంత్రి హరీశ్‌రావు కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖపై గట్టి ఒత్తిడి తేవటం ఫలితాన్నిచ్చింది.ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి తీసుకోవాల్సిన చర్యలు, నిధులు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కొన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులతో ఉపసంఘం ఏర్పాటుచేసింది. అందులో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా సభ్యుడుగా ఉన్నారు.
తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు గ్రాంటు, రుణ రూపేణా పి.ఎం.కే.ఎస్.వై. ద్వారా లభించనున్నాయి.తెలంగాణ నుంచి ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజనలో చోటు లభించిన వాటిలో మత్తడివాగు, నీల్వాయి, గొల్లవాగు, ర్యాలివాగు, పాలెంవాగు, రాజీవ్ బీమా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి. పూర్తయిన ప్రాజెక్టులకు సంబంధించి సర్టిఫికెట్లు జరీ చేయాలని కూడా హరీశ్ కోరారు. గతం లో ఏ.ఐ.బి.పి. కింద మంజూరైన ప్రాజెక్టులలో ఇంకా మిగిలి ఉన్న పనులు, బాటిల్ నెక్స్ సమస్యలు ఇతర అంశాలను మంత్రి సమీక్షించారు. పి.ఎం.కే.ఎస్.వై. కింద చేపట్టిన ప్రాజెక్టులలో నాబార్డు నేరుగా కాకుండా జాతీయ జల అభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రాలకు రుణం అందజేస్తుంది. సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద గుర్తింపు పొందిన ప్రాజెక్టులకు 2012 వరకు ఆమోదం పొందిన మొత్తం వ్యయం కంటే 20శాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం గత ఏడాది నిర్ణయించింది. భూసేకరణ వ్యయం భారీగా పెరిగినందున ఇప్పటి వరకు పెరిగిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రాలు ఒత్తిడి చేయడంతో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ అంగీకరించింది.
ఇప్పటివరకు గిరిజన ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు కేంద్రం 90శాతం గ్రాంటు ఇచ్చేది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు కూడా దీనిని వర్తింపచేయాలని వచ్చిన డిమాండుకూ కేంద్రం అంగీకరించింది. దేవాదుల ప్రాజెక్టును గతంలోనే కేంద్రం పి.ఎం.కే.ఎస్.వై. లోకి తీసుకోగా తర్వాత కొమురం భీం ప్రాజెక్టు, రాజీవ్ భీమా ఎత్తిపోతల ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ప్రాజెక్టు, ఇందిరమ్మ వరదనీటి కాల్వ ప్రాజెక్టు, పాలెంవాగు ప్రాజెక్టు, పెద్దవాగు ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టు, ర్యాలివాగు ప్రాజెక్టు, గొల్లవాగు ప్రాజెక్టులను పీఎంకెఎస్‌వైలో చేరాయి. కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల చేయాలని, ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు ప్రక్రియను సరళతరం చేయాలని, నాబార్డు నుంచి రుణాల విడుదలకు కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి హరీష్ రావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టులు నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తికావాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కేంద్రం నిధులు విడుదల చేయాలని హరీశ్ రావు కోరారు. అలాగే మొదటి విడత నిధుల విడుదలకు, రెండవ విడత నిధుల విడుదలకు ముడి పెట్టరాదని హరీష్ రావు అన్నారు పేర్కొన్నాయి. పీఎంకేఎస్‌వై పథకం కిందికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు పూర్తికావాలంటే కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం సహకారం ఉండాలని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షా సమావేశం లో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. జోషి, సెక్రెటరీ వికాస్ రాజ్, ఇ.ఎన్.సి. మురళీధర్ రావు, ఇ .ఎన్.సి లు నాగేందర్ రావు, అనిల్, సి.లు భగవంతరావు, బంగారయ్య, కాడా కమిషనర్ మల్సూర్, ఓ.ఎస్.డి దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.