రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవ ఫలితం ఇస్తోంది. దాహార్తితో అలమటిస్తోన్న ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాల ప్రజలకు సమృద్ధిగా నీరిందించే అర్భన్ మిషన్ భగీరథ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగర పాలక సంస్థ పరిధిలో జలసిరులు అందించేందుకుగానూ అర్భన్ మిషన్ భగీరథలో భాగంగా జలమండలి రూ. 628కోట్లతో తాగునీటికి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వేగంగా సాగుతున్న పనులను చూసిన వారు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నారు.
గత ఆగస్టులో ఈ పనులను మొదలు పెట్టిన జలమండలి ఏడాదిలోగా ఈ పనులను పూర్తి చేయాలన్న నిర్ధేశిత గడువుతో రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 180 రిజర్వాయర్ల నిర్మాణంలో 80 రిజర్వాయర్ల పనులు ప్రారంభించారు. వచ్చే నెలా చివరి వారంలో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో పాటు ఇన్‌లెట్, ఔట్ లెట్ పనులను చేపట్టి వచ్చే ఏడాది జనవరిలో తొలి భగీరథ ఫలాలను అందించే దిశగా పనులను వేగిరం చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు. వచ్చే ఆగస్టు నాటికి ఈ పథకం పూర్తి చేయడం ద్వారా పది లక్షల జనాభాకు రోజూ 30 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా అందించడంతో పాటు నూతనంగా 1, 50,000 నల్లా కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పైపులైన్ విస్తరణ, రిజర్వాయర్ల నిర్మాణానికి తక్షణం అనుకూలంగా ఉన్న చోట్ల పనులను ఇటీవల మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే షామీర్‌పేట మండలంలోని ఉప్పల్‌పల్లి, హకీంపేట, పటాన్‌చెరువు మండలంలోని గండిగూడెం, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ, ఇల్లాపూర్, కుత్భుల్లాపూర్ మండలంలోని బౌరంపేట, ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల గ్రామాల్లో రిజర్వాయర్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. 80 చోట్ల రిజర్వాయర్ల పనులను ఇప్పటికే 25శాతం మేర పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 285 కిలోమీటర్ల మేర ట్రంక్ మెయిన్స్ పైపులైన్, 1712 డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ల పనులను వచ్చే నెలలో మొదలు పెట్టనున్నారు.