ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ శ్రేణులకు శుభవార్త .గత కొద్దిరోజులుగా అత్యంత ఆసక్తిరేపిన తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ తీర్పు వెలువడడంతో వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర సన్నాహాలు ముమ్మరం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం నెలలో ప్రతీ శుక్రవారం కోర్ట్ కి హాజరుకావాల్సిన అవసరం లేకపోవడంతో వైసీపీ శ్రేణులకు కొంత ఉపశమనం దక్కింది.
అయితే జగన్ ఆశించినట్టుగా పూర్తిగా మినహాయింపు ఇవ్వడానికి కోర్ట్ నిరాకరించడం మాత్రం నిరాశ కలిగించే అంశమే.నవంబర్ 2 నుంచి ఆరు నెలలపాటు పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని జగన్ తరపు న్యాయవాది పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం విచారించిన సీబీఐ కోర్టు.. జగన్ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
కానీ నెలలో ఒక శుక్రవారం మాత్రం వ్యక్తిగతంగా తప్పనిసరిగా హాజరుకావాలని జగన్ కి కోర్టు తెలిపింది.దాంతో ఇక ఇప్పుడు జగన్ నాలుగు వారాలకు ఒకమారు కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. నెలకు ఒకరోజు పాదయాత్రకు విరామం ఇస్తారా లేక ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అన్న చర్చ సాగుతోంది. ప్రజాసమస్యల మీద తాను చేస్తున్న ప్రయత్నాలకు అనుమతి ఇవ్వాలని జగన్ పైకోర్ట్ ని కూడా ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తోంది. కింద కోర్ట్ 4 వారాల మినహాయింపు ఇవ్వడంతో మరికొన్ని మినహాయింపులకు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చంటున్నారు. దాంతో జగన్ పాదయాత్ర నిరాటంకంగా సాగడం ఖాయమని వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు.అదే సమయంలో టీడీపీ నేతలకు ఈ పరిణామం మింగుడుపడకపోవచ్చు. కోర్ట్ లో జగన్ కి అభ్యంతరం వస్తుందని ఆశిస్తే దానికి భిన్నంగా కోర్ట్ కొంత మినహాయింపు ఇవ్వడం ఆపార్టీ నేతలకు ఆశాజనకంగా ఉండదనే చెప్పవచ్చు