తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న ప్రదానం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ రోజు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తన కన్న బిడ్డల్లా చూస్తూ.. పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్‌ను ఈనెల 25న రవీంద్రభారతిలో సన్మానించనున్నట్లు వారు చెప్పారు.
రాష్ట్రాన్ని శాంతియుత మార్గంలో తీసుకెళ్తున్నందున కేసీఆర్‌కు ‘శాంతిదూత’ బిరుదు ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లో మత ఘర్షణలకు తావులేవన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ఆటో రిక్షా కార్మికులకు సీఎం ఎంతో చేశారని కృతజ్ఞతలు వారు తెలిపారు.