తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నేపద్యంలో రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుపై చర్చ జరిగింది. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాస్‌బుక్ యాక్ట్-1971ను మంత్రివర్గం ఆమోదించింది. రిజిస్ట్రేషన్ కాగానే 15 రోజుల్లోగా మ్యుటేషన్‌తో పాటు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించేలా కొత్త చట్టం తెచ్చారు. దీని ప్రకారం ఏ భూములు రిజిస్ట్రేషన్ చేయాలన్నా తెలంగాణ ల్యాండ్ రికార్డ్ మేనేజ్‌మెంట్ సిస్టం(టీఎల్‌ఆర్‌ఎంఎస్) రికార్డులు చూశాకే చేయాల్సి ఉంటుంది.
అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేకుండా యాక్ట్‌ను తెచ్చారు. పత్తి సేకరణలో మండలస్థాయిలో రైతు సమన్వయ సమితుల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మంత్రులందరూ ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఇంకా పలు సంస్థలకు భూముల కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గేమింగ్, గ్యాంబ్లింగ్ ప్రొహిబిషన్ యాక్ట్‌తో పాటు మరో 6 బిల్లులపై మంత్రివర్గం చర్చించి, ఆమోదించింది. ఈ బిల్లులను ఈ నెల 27వ తేదీ నుంచి జరిగ శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.