గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో విజయాన్ని దక్కించుకుంటూ వస్తున్నా బీజేపీ పార్టీ ఈ సారి కూడా అధికారంలోకి రావాలని పావులు కదుపుతుంది .కనీసం ఇప్పటికైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పావులు కదుపుతుంది కాంగ్రెస్ పార్టీ .ప్రస్తుతం జరగనున్న ఈ ఎన్నికలు రానున్న లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో ఇరు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి .
1995 నుంచి బీజేపీ ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. 2012 ఎన్నికల్లో 115 సీట్లు, 2007లో 117, 2002లో 127 స్థానాలు పొందింది. ఈసారి 150 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంది.రాహుల్ నాయకత్వానికి పరీక్ష.. కాంగ్రెస్‌కు, రాహుల్ గాంధీకి కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిని చేస్తారన్న వూహాగానాల నేపథ్యంలో ఆయనకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే కాంగ్రెస్ వరుసగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింఘ్ వాఘేలా తిరుగుబాటు చేసి ఆ పార్టీని వీడారు. పలువురు ఎమ్మెల్యేలు భాజపా వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
5 అంశాలే కీలకం
ఎన్నికల్లో అయిదు అంశాలే ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
* పాటీదార్ రిజర్వేషన్లు: పటేళ్ల (పాటీదార్లు)ను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో గత కొంతకాలంగా ఆందోళన జరుగుతోంది. ఆ సామాజిక వర్గం అభివృద్ధి కోసం గత నెలలో ప్రభుత్వం ఓ కమిషన్, మరో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా కలిగించలేదు.
* జీఎస్టీ: జీఎస్టీ అమలు తీరుపై భాజపా మద్దతుదార్లయిన చిన్న, మధ్య తరహా వ్యాపారులు అసంతృప్తితో ఉన్నారు. వస్త్ర పరిశ్రమపై విధించిన 5% పన్ను రద్దు చేయాలని వ్యాపారులు డిమాండు చేస్తున్నారు.
* నర్మదా డ్యాం: నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్ట రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది. ఆనకట్ట ప్రారంభమైనా పంట కాలువల పనులు పూర్తి కాలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
* నిరుద్యోగం: ఉద్యోగాలు కల్పించాలంటూ గత మూడేళ్లుగా రాష్ట్రంలో యువకులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల పనితీరు బాగున్నా, తగినన్ని ఉద్యోగాల కల్పన జరగడం లేదన్న వాదన ఉంది.
* తాత్కాలిక ఉద్యోగులు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ తాత్కాలిక ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, క్లర్కులు వంటి సిబ్బంది గత రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. కొందరు జీతాలు పెంచాలని కోరుతుండగా, మరికొందరు పర్మినెంట్ చేయాలని డిమాండు చేస్తున్నారు.