తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మరోసారి సంచలన వాఖ్యలు చేసారు . ఈ రోజు హైదరాబాదులో మీడియాతో అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని… వారే పార్టీ తరపున పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు.ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబం నుంచి తాను వచ్చానని… రేవంత్ రెడ్డి ఎక్కడ నుంచి వచ్చారో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు . డబ్బు కోసం చీకటి ఒప్పందాలు చేసుకునే రకం నేను కాదని చెప్పారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి, రేవంత్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అయన మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. గతంలో స్టార్ హోటళ్లలో నిర్వహించిన సమావేశాలకు రేవంత్ హాజరయ్యారని… ఆ సమావేశాలకు డబ్బు ఎవరు పెట్టారని అప్పుడు వచ్చారని రమణ ప్రశ్నించారు. రేవంత్ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలనే తాము కోరుతున్నామని… అంత వరకు ఆయనను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోమని స్పష్టం చేశారు. కాసేపట్లో తమ అధినేత చంద్రబాబుతో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
