శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో నాలాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.బహుముఖ వ్యూహం అవలంభించి నాలాల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. నాలాలపై అక్రమ నిర్మాణాలకు పరిహారం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. నాలాలపై పేదలే అధికంగా ఇళ్లు నిర్మిస్తారనే కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపులో పాతబస్తీలో ప్రజాప్రతినిధుల చొరవ అభినందనీయమన్నారు. అదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా నాలాల తొలగింపునకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కేటీఆర్ కోరారు.
