ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ పై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన వాఖ్యలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ ఉన్న సంగతి మనదరికి తెలిసిన విషయమే . నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు మెర్జ్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలను కలిపి ‘చైనా’ (చైతన్య, నారాయణ) సంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి.ఈ క్రమంలో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ చైతన్య విద్యాసంస్థలను వేధిస్తున్నారని ఆరోపించారు. చైతన్య విద్యాసంస్థలను దెబ్బతీసేందుకు గత కొంతకాలంగా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా నారాయణ విద్యాసంస్థలతో కలిసి పని చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో అవమానాలు భరించామని ఆమె చెప్పారు. ఇంకెన్నో మోసాలను కూడా చూశామని ఆమె వెల్లడించారు. తమ ఓపిక నశించిందని, ఇకపై నారాయణ విద్యాసంస్థలతో కలిసి ప్రయాణం చేయడం కష్టమనే అభిప్రాయానికి వచ్చామని ఆమె తెలిపారు.
