రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య రవాణా సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని ఎంపీ బూరనర్సయ్య గౌడ్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు. అత్యధిక వేగంతో రైళ్లు నడిచేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాలని లేఖలో కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఇపుడున్న 45వ నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా కొత్త ఎక్స్ ప్రెస్ హైవే రావాలని, దానికి పక్కనే హై స్పీడ్ రైల్వే ట్రాక్ ఉండాలని ఎంపీ బూర విజ్ఞప్తి చేశారు.ఎక్స్ ప్రెస్ హైవే, హై స్పీడ్ రైల్వే ట్రాక్ ల ఏర్పాటు కోసం ఇప్పటికే పలు సార్లు కేంద్రాన్ని కోరానని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీలో ఉన్న ఓడ రేవుల దృష్ట్యా అమరావతి-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ హైవే రెండు రాష్ట్రాల వాణిజ్య అవసరాలను తీర్చడంలో బాగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
