నల్లగొండలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, అటవీ సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వందేళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. సహకార బ్యాంకులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతులకు మద్దతు ధర అందిస్తున్నాయని చెప్పారు. దేశములోనే తెలంగాణ రైతులను ధనిక రైతులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు గొప్పగా బతకాలని సీఎం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే సీఎం లక్ష్యమని మంత్రి జగదీష్‌రెడ్డి ఉద్ఘాటించారు.
