తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలను గుర్తించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు.ఇవాళ హైదరాబాద్‌లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో జరుగుతున్న ఆత్మీయుల మాటా ముచ్చట సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కేసీఆర్ సీఎం అయితే తెలంగాణను అభివృద్ది చేస్తానని ప్రజలను నమ్మించి , తెలంగాణ రాష్ట్ర౦ ఏర్పడగానే కేసీఆర్ డిల్లీ కి వెళ్లి సోనియాను కలిశారన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసీఆర్ ఆలోచన చేయలేదన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షమేరకు సీఎం కేసీఆర్ పని చేయడం లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.చంద్రబాబుతో కలిసి పది సంవత్సరాలు పని చేశానన్నారు. ప్రధాని అయ్యే అవకాశమొచ్చినా తెలుగు ప్రజల కోసం చంద్రబాబు దాన్ని వదులుకున్నారన్నారు. 2006లో జడ్పీటీసీగా స్వతంత్రంగా గెలిచానని, ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని టీడీపీలో చేరానన్నారు. టీడీపీలో 50 రోజుల్లో 10 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను చేశామన్నారు.
ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు అనంతరాములు తదితరులు హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటారు.