శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమాధానమిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పునరుజ్జీవానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా మంథని నియోజకవర్గంలో 38 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఎల్లంపల్లి నుంచి మేడిపల్లి వరకు 109 కిలోమీటర్లు.. దీనిలో 100 కిలోమీటర్లు.. 365 రోజులు గోదావరి నిండుగా ఉంటుందన్నారు. దీని వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అంతే కాకుండా గోదావరిపై వరుస బ్యారేజీలు కట్టడం వల్ల మత్స్యపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. మత్స్యకారులు బాగుపడే అవకాశం ఉందన్నారు. నీటి లభ్యత వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. మంథని నియోజవకర్గ ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. భూపాలపల్లి – గడ్చిరోలి, భూపాలపల్లి – మంచిర్యాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త సీఎం కేసీఆర్ అని తెలిపారు. దీనిపై సీఎం.. అధికారులతో గంటలు గంటలు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనం మేడిగడ్డ అని హరీష్‌రావు అన్నారు
