శాసనసభలో పంటలకు మద్దతు ధరపై చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షనాయకులు జానారెడ్డి ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. జానారెడ్డి తనకు ఉదార వైఖరి ఉందన్నారని.. అందుకు ధన్యవాదాలన్నారు. జానారెడ్డి కూడా రైతు బిడ్డే, వ్యవసాయం చేస్తడు… అయనకు రైతుల పట్ల ఉన్న చింత నిజంగా హర్షించదగ్గదని సీఎం అన్నారు.మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల గురించి మాట్లాడిన మాటలపై ఆయన స్పందించారు. రూ. 8000 కోట్లు పెట్టి ధాన్యం కొన్నామని మంత్రి చెప్పింది నిజం కాదా అని కాంగ్రెస్ నేతలను సీఎం ప్రశ్నించారు. రూ. 5000 కోట్లు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని సీఎం అన్నారు. ఫ్రీ కరెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది నిజమేనని.. అయితే.. ఫ్రీ కరెంట్‌తో కోతలు పెట్టి కాంగ్రెస్ రైతులను చంపిందని.. తమ ప్రభుత్వం కోతలు లేకుండా చేసిందన్నారు.
ఒకప్పుడు కరెంట్ వస్తే వార్త అని.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అంటూ సీఎం చమత్కరించారు. చత్తీస్‌ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ర్టాల్లో ఉచిత కరెంట్ ఇవ్వట్లేదన్నారు. అకాల వర్షంతో రాష్ట్రంలో పత్తి తడిసిందన్నారు. తడిసిన పత్తిని సీసీఐ కొనదు, వ్యాపారస్థులు కొనరన్నారు.మన దగ్గర ధర బాగుందని మహారష్ట్ర రైతులు ఆదిలాబాద్‌కు వచ్చి పత్తి అమ్ముకుంటున్నారన్నారు. ఒక్క ఏడాదిలో 100కు పైగా జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసినమన్నారు. వరంగల్ టెక్స్‌టైల్స్ పార్క్‌లో కూడా జిన్నింగ్ , స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేస్తామన్నారు. గత సంవత్సరం 97 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినమన్నారు.
10 వేల మెగావాట్ల విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నట్లు సీఎం తెలియజేశారు. ఎన్నికల సమయంలో అన్ని రుణాలు మాఫీ చేస్తమని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండని… ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నో కొర్రీలు పెట్టిండని సీఎం అన్నారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర, అంతకు మించిన ధర కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. రూ. 17 వేల కోట్ల రుణ మాఫీ చేసినప్పుడు.. రూ. 400 కోట్ల వడ్డీ ఇవ్వడానికి భయపడతామా అని సీఎం ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని ఒక్క రైతు కూడా మాకు ఫిర్యాదు చేయలేదన్నారు.