ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి విదితమే .నిన్న బుధవారం ఏపీలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్ పాదయాత్రను ప్రస్తావిస్తూ జగన్ నిర్వహించతలపెట్టిన పాదయాత్రలో భాగంగా తుని వంటి విధ్వంసం జరగవచ్చు అని అన్నారు .ఈ వ్యాఖ్యలను బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ పత్రిక మెయిన్ పేపర్లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .
దీనిపై ఈ రోజు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నతెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోంపేట రామలింగారెడ్డి, కాంగ్రెస్ నేత మల్లు రవి, ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సురేష్‌లు ముఖ్యమంత్రి హోదా లో ఉండి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై తమ అనుమానం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోంపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ నేరుగా ఏపీ రాష్ట్ర డీజీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అందరూ ఐపీఎస్‌లు వేరు డీజీపీ సాంబశివరావు తీరు వేరని వ్యాఖ్యానించారు.
గతంలో సాంబశివరావు మెదక్ ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయన వైఖరిని బాగా గమనించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే ఆయన ఏదైనా చేయించగల సమర్ధుడని రామలింగారెడ్డి చెప్పారు అని వార్తలు వస్తున్నాయి . టీడీపీ కార్యకర్తలతో కూడా పనిలేకుండా… మఫ్టీలో పోలీసులను పంపించి తుని లాంటి ఘటనలు చేయించగల సమర్థుడు సాంబశివరావు అని ఆయన వ్యాఖ్యానించారు. తాను స్వీయ అనుభవంతో ఈ విషయాలు చెబుతున్నాను ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, పోలీసుల వైఖరిని బట్టి చూస్తుంటే అనుమానంగానే ఉందని ఆయన అన్నారు అని ఒక ప్రముఖ మీడియా ప్రచారం చేసింది .చంద్రబాబు వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఖండించారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయన్నది గమనించుకోవాలన్నారు. గతంలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారని…. అప్పుడు జరగని విధ్వంసం ఇప్పుడెందుకు జరుగుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలు పాదయాత్ర చేస్తున్న వ్యక్తికి నష్టం కలిగించేలా…. ప్రాణహాని తలపెట్టేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.