ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి గేరు మార్చి మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహం సిద్ధం చేశారు ఆ పార్టీ వ్యూహకర్తలు. నవంబర్ 6 నుంచి జగన్ జనంలోకి పాదయాత్రగా వెళతారు. ఆ తరువాత నవంబర్ 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ అంతా రచ్చబండా, పల్లెనిద్ర కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల్లో ఉండాలి. ఇలా ఆరునెలలపాటు అధినేత తో పాటు క్యాడర్ కష్టపడాలి. ఇది ప్రస్తుతం వైసిపి ప్రణాళికా బద్ద కార్యక్రమం. అసెంబ్లీ ని బహిష్కరించి ఇలా ప్రజాక్షత్రంలోనే గడిపే ఈ కార్యక్రమం ద్వారా తాము ప్రజల్లోనే ఉంటామనే సంకేతాలు బలంగా చాటుకోవాలని వైసీపీ ఆలోచన.
అంతే కాకుండా వైసీపీ మీడియా విభాగం, పీకే టీం సారధ్యంలో రచ్చబండ, పల్లెనిద్ర ఎక్కడ ఎలా సాగుతున్నది అధినేత జగన్ కు పాదయాత్రలో ఆన్లైన్ ద్వారా సమాచారం బట్వాడా చేయబడుతుంది. తద్వారా పార్టీ కార్యక్రమాలు బలహీనంగా వున్న చోట జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. క్యాడర్ ను జనంతో అనుసంధానం చేసేందుకు ఇప్పటికే గడప గడప కు వైఎస్సార్, వైఎస్సాఆర్ కుటుంబం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, పార్టీ క్యాడర్ ఇచ్చింది. ఇక సర్వే టీం లు అందజేసే వివరాలను ఎప్పటికప్పుడు జగన్ పర్యవేక్షిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సుమారు 6 నెలల కాలం పార్టీ అధినేత రోడ్డుపై ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థబ్ధత లేకుండా కదిలే కార్యాలయాన్ని జగన్ రూపొందించుకోవడం విశేషం అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.