నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు .శాసనసభలో కేసీఆర్ కిట్లపై లఘు చర్చ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజల్లో సీఎం కేసీఆర్ విలువలు పెంచుతున్నారని తెలిపారు.కేసీఆర్ కిట్.. పేదల జీవితాల్లో వెలుగులు నింపే పథకమని ఈ సందర్భంగా అన్నారు . కేసీఆర్ కిట్లు ప్రజల్లో బాగా ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి సీఎం పెద్దపీట వేశారని స్పష్టం చేశారు.గర్భిణీలు ప్రసూతి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కిట్ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ పథకం ద్వారా.. ఒక మేనమామ, తోడ పుట్టిన అన్నలా, తాతలా మన సీఎం వ్యవహరిస్తున్నారు. కుటుంబ సభ్యులు చేయాల్సిన పనులను ప్రభుత్వం చేస్తుందన్నారు. నిరుపేదలను అప్పుల బాధ నుంచి విముక్తి చేసేందుకు కేసీఆర్ కిట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుందన్నారు.
గర్భిణీ కానీ, పాలిచ్చే తల్లికి కానీ పోషకాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మీ పథకం తీసుకువచ్చారని తెలిపారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి రేటు పెరిగిందన్నారు. ప్రయివేటు ఆస్పత్రులు.. సిజేరియన్ అవసరం లేకున్నా.. చేసి గ్రామీణ ప్రాంత ప్రజలను నిలువునా మోసం చేసేవారని పేర్కొన్నారు. వీటన్నింటికి స్వస్తి పలకాలని చెప్పి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీస్‌ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేసీఆర్ కిట్ వల్ల తల్లీబిడ్డ క్షేమంగా ఉంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి రేటు కూడా పెరుగుతుందన్నారు. శిశువుల ఆరోగ్యపరంగా కేసీఆర్ కిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేసీఆర్ కిట్‌తో గర్భిణీల ముఖంలో సంతోషంగా చూశామన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న పిల్లలకు కేసీఆర్ కిట్ ఇవ్వరని తెలిపారు. కేసీఆర్ కిట్స్ వల్ల నవజాత శిశువుల మరణాలు కూడా తగ్గుతున్నాయి. గతంలో అంగన్‌వాడీ సెంటర్లలో చాలా నిర్లక్ష్య వైఖరి ఉండేందన్నారు. ఇప్పుడు మాత్రం అంగన్‌వాడీ సెంటర్లలో గుడ్లు, పాలతో పాటు పోషకాహారాన్ని అందజేస్తున్నారని తెలిపారు.
రెసిడెన్షియల్స్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు న్యాయం జరిగేలా సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. రెసిడెన్షియల్స్ స్కూల్స్‌కు లక్షలాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. విదేశీ విద్యకోసం.. బడుగు బలహీనవర్గాల వారికి ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ ఇస్తున్నారని గుర్తు చేశారు. పేద ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద రూ. 75 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నారని వెల్లడించారు. ఈ పథకాల వల్ల బాల్యవివాహాలు తక్కువ అయ్యాయని తెలిపారు. సీఎం తీసుకునే ఏ పథకాన్ని కూడా ప్రజలు తప్పుబట్టే పరిస్థితి లేదన్నారు. కేవలం ప్రతిపక్షాలు మాత్రమే పథకాలను తప్పుబడుతున్నాయని మండిపడ్డారు. ఏ పథకం అమలు చేసినా పొరపాట్లు జరగడం సహజమేనని చెప్పారు. పథకాల అమలు విషయంలో పొరపాట్లు జరిగితే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.