తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిగ్ షాక్ తగిలింది . ఈ క్రమంలో జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్, మంథని నియోజకవర్గంలోని కాటారం జడ్పీటీసీ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, నేడు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన సతీమణి మాజీ ఎంపీపీ చల్లా సుజాతతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకగణంతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ సమక్షంలో చేరుతున్నారు . కాటారం మండలం ధన్‌వాడ గ్రామానికి చెందిన చల్లా నారాయణరెడ్డి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ముఖ్య అనుచరుడిగా, ఆయన మరణానంతరం శ్రీధర్‌బాబు కుడి భుజంగా కాంగ్రెస్‌లో పలు జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులు పొందారు. తొలుత ధన్‌వాడ సర్పంచ్‌గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సింగిల్ విండో, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన భార్య చల్లా సుజాత సైతం కాటారం ఎంపీపీగా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాటారం జడ్పీటీసీగా నారాయణరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు అత్యంత సన్నిహితునిగా ఉంటూ కాంగ్రెస్‌కు తూర్పు డివిజన్ కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే ఇటీవల టీఆర్‌ఎస్ ముత్తారం మండల పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇంటిలో గంజాయి పెట్టిన కేసులో ఇరికించాలనే కుట్రలో శ్రీధర్‌బాబు భాగస్వామ్యమైనట్లు సెల్ ఫోన్ సంభాషణలు తెరపైకి రావడంతో తీవ్ర అసహనానికి గురైన నారాయణ రెడ్డి, ఇది మంచిపద్ధతి కాదని పలువురి వద్ద ఖండించినట్లు సమాచారం. ఈ క్రమంలో తాను టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకొని, పలువురి ద్వారా ఎమ్మెల్యే పుట్ట మధు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన చేరికకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
