తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని రామాంతపూర్ లోని నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నవీన్, పాఠశాల ప్రిన్సిపల్ సరితా అగర్వాల్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపులు నిన్న బుధవారం నాడువెలుగులోకి వచ్చాయి . తాజాగా ఈ ఆడియో టేపులు పోలీస్‌స్టేషన్‌కు చేరాయి.
ఈ టేపుల్లో ఒక కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ, ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న శ్రీలత ఉదంతం గురించి చర్చించారు. ఆమె అనుమానాస్పద మృతిని శవపరీక్ష సమయంలో మేనేజ్ చేశారని ఈ టేపుల్లో ఒక ఉద్యోగి మాట్లాడారు. ఈ వ్యవహారంపై విద్యార్థి, సంక్షేమ సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు దృష్టి సారించారు.
ఈ ఆడియో టేపుల గురించి మాట్లాడేందుకు నాలుగు రోజుల క్రితం సంస్థ సిబ్బంది సతీష్, రమేశ్ తనను పిలిపించారని, ఆడియో, వీడియో టేపుల్ని ఇవ్వాలని బెదిరించి అపహరణకు ప్రయత్నించారని నవీన్ ఉప్పల్ పోలీసులకు రెండ్రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. మరోవైపు నవీన్ తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, ఫోన్‌లో అసభ్యకర పదజాలంతో మాట్లాడాడంటూ సరితా అగర్వాల్ బుధవారం ఉప్పల్ పోలీసుల్ని ఆశ్రయించారు. శ్రీలత అనుమానాస్పద మృతి వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఏబీబీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం నారాయణ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈమొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ ఎస్సై ఆంజనేయులు ఈ సందర్భంగా తెలిపారు.