తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టులపై కోర్టుల్లో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నరని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్‌రావు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజావిశ్వాసం కోల్పోయిందన్నారు. తప్పుడు విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నరని తెలిపారు. చనిపోయిన వారి పేర్లతో కేసులు వేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ ఏ ప్రాజెక్టులను అడ్డుకోలేదని గుర్తుచేశారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అర్థం కాక గందరగోళం సృష్టిస్తున్నరు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ నేతలు ప్రజల విశ్వాసం పొందలేరన్నారు. తెలంగాణ రైతుల కన్నీరు తుడవడానికి సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేపట్టారని తెలిపారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేందుకు సీఎం అన్ని విధాలా కృషి చేస్తున్నరని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని.. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి రైతులకు నీరందిస్తామన్నారు. గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తమన్నారు. ఇప్పటికైనా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ మానుకోవాలని మంత్రి హితవు పలికారు.
