న్యూజిలాండ్ కు సంబంధించిన ప్రముఖ క్రికెటింగ్ మెటీరియల్ తయారీ సంస్థ ‘లేవర్ అండ్ ఉడ్’తమ షోరూమ్ ను యావత్తు భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రారంభించారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఈ షోరూమ్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆ షోరూమ్ లోనే సరదాగా కాసేపు కేటీఆర్ క్రికెట్ ఆడారు.‘లేవర్ అండ్ ఉడ్’ ప్రతినిధి విసిరిన రెండు బంతులను కేటీఆర్ కొట్టారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య వేసిన మరో రెండు బంతులను కేటీఆర్ ఆడటం గమనార్హం. షోరూమ్ కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అతిథులు, ప్రముఖులు ఆసక్తితో చూశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సోదరుడు ఆదిత్య వేమూరి, వారి మిత్రులు కలిసి ‘లేవర్ అండ్ ఉడ్’ షోరూమ్ ను హైదరాబాద్ నగరానికి తీసుకురావడం చాలా సంతోషమని అన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాలు, వయసుల వారిని ఆకట్టుకునే అద్భుతమైన క్రీడ క్రికెట్ అని, ఆ క్రీడకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అన్నారు. అంతర్జాతీయ సంస్థ ‘లేవర్ అండ్ ఉడ్’ లో నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న క్రికెటింగ్ సామగ్రి లభిస్తుందని అన్నారు. మహ్మద్ సిరాజ్ తప్పా హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ఏ క్రికెటర్ కూడా టీమిండియాలో లేరని, ఇక్కడ ఉన్న స్పోర్టింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదని సీఎం కేసీఆర్ ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసారు