ఎమ్మార్పీఎస్ ఆందోళనలో మహిళా కార్యకర్త మరణించడంపై ప్రభుత్వ విప్ నల్లల ఓదెలు విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు శవరాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతి పట్ల సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారని తెలిపారు. వారి కుటుంబానికి నిండు అసెంబ్లీ సాక్షిగా 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని విప్ ఓదెలు తెలిపారు. వారి కుటుంబంలో ఒక్కరి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం అని సీఎం కేసీఆర్ చెప్పారని వివరించారు.
ఇలా ప్రభుత్వం తక్షణమే స్పందించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారు శవ రాజకీయాలు చేస్తున్నారని ఓదెలు మండిపడ్డారు. గతంలో కూడా ఎస్సీ వర్గీకరణకు తామూ ఎమ్మార్పీఎస్ తో కలిసి పోరాటం చేశామని వివరించారు. `వర్గీకరణ చట్టం తెస్తాం అని చెప్పింది కాంగ్రేస్ పార్టీ ఇస్తాం అని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ వారే. గతంలో కాంగ్రెస్ పార్టీ వారే ప్రధాన మంత్రులు ఉన్నారు. అప్పుడు మీరు ఎం చేశారు? ` అని సూటిగా ప్రశ్నించారు.
వర్గీకరణ కోసం గతంలో ఎప్పుడు కూడా మాట్లాడని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడని విప్ ఓదెలు విమర్శించారు. “2009లో వర్గీకరణ కోసం గాంధీభవన్ ముట్టడి సమయంలో దురదృష్టవశాత్తు ముగ్గురు యువకులు చనిపోయారు కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం నివాళులు కూడా అర్పించలేదు“ అని విప్ ఓదెలు గుర్తు చేశారు. తాజా ఘటనలో సోదరి భారతి చనిపోవడం బాధాకారమని…అయిన తమ ముఖ్యమంత్రి వారిని అదుకున్నారని…విప్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేయడం తగదని…దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.