ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు .జగన్ పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా నరకాసురుడు చంద్రబాబు అరాచక పాలన అంతమయ్యేంత వరకు జగన్ పాదయాత్ర ఆగదని అన్నారు. చంద్రబాబు పాలన అవినీతి కంపు కొడుతోందని… దుష్ట పాలనకు ముగింపు పలకాల్సిన తరుణం ఆసన్నమైందని ఆమె తెలిపారు. అనుభవం ఉంది కదా అని చంద్రబాబును ప్రజలు నమ్ముకుంటే… రాష్ట్రాన్ని నట్టేట ముంచేశారని విమర్శించారు. జగన్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినందుకు ప్రజలంతా ఇప్పుడు బాధపడుతున్నారని ఆమె చెప్పారు. ఇప్పటిదాకా ఒక లెక్కని… ఈరోజు నుంచి మరో లెక్క అని అన్నారు. ఇప్పుడందరూ జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజల కళ్లల్లో ఆనందం చూసేందుకే జగన్ పాదయాత్ర అని చెప్పారు.
వైయస్ కుటుంబానికి పదవులు ముఖ్యం కాదని… ప్రజలే ముఖ్యమని రోజా అన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం సోనియా, మోదీలాంటి వాళ్లతో కొట్లాటకు కూడా జగన్ సిద్ధమేనని చెప్పారు. చంద్రబాబు పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. ఈ రోజు నుంచి టీడీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు. టీడీపీ తప్పులను లెక్కకట్టడానికే జగన్ ఈ రోజు నుంచి ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు.