మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. 1985లో పల్లెటూరు వాతావరణం ఎలా ఉండేదో ఈ సినిమాతో చూపించబోతున్నాడు సుకుమార్.
తాజాగా రంగస్థలం సినిమా సెట్‌కు సంబంధించిన ఓ ఫొటోను మైత్రీ మూవీమేకర్స్ అభిమానులతో పంచుకుంది. రంగస్థలం జాతర అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోలో రంగురంగుల చొక్కా ధరించి రామ్ చరణ్ జాతరను చూస్తూ కనిపించారు. అయితే ఆయన ముఖాన్ని మాత్రం చూపించలేదు. రంగులరాట్నం, జట్కా, బొమ్మలు ఇలా వాతావరణమంతా సందడిగా కనిపించింది.
ఇక రంగస్థలం శాటిలైట్ హక్కులను 18 కోట్లకు ఓ తెలుగు టీవీ ఛానల్ సొంతం చేసుకున్నట్లు టాక్. హిందీలోనూ ఓ ఎంటర్టైన్‌మెంట్ ఛానల్ దాదాపు 10 కోట్లకు పైగానే సొంతం చేసుకుందని సమాచారం. ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిసర ప్రాంతల్లోని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.