హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నవంబరు 28న ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో సేవలు ప్రారంభించనున్నారు.ఈ క్రమంలో అద్భుతశైలిలో నిర్మాణం జరుపుకుంటున్న మెట్రో రైల్వే ప్రాజెక్టు పచ్చదనం పరుచుకుంటోంది. ఇప్పటికే నగరంలోని మెట్రో ప్రాంతాల్లో మొక్కలు నాటామని మెట్రో అధికారులు చెబుతున్నారు. పిల్లర్‌కు పిల్లర్‌కు మధ్య అలాగే రైల్వేస్టేషన్ల వద్ద గ్రీనరీని పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కాలుష్యరహిత చెట్లు, ఔషదమొక్కల పెంచి ప్రజలకు ఎలాంటి హానీ కలుగకుండా అన్ని చర్యలు చేపట్టింది హైదరాబాద్ మెట్రో. 72కిలోమీటర్ల మేర విస్తరించిన మూడు కారిడార్లలో గ్రీనరీని పెంచేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసింది హైదరాబాద్ మెట్రో, ఎల్అండ్టీ కంపెనీ.ఇందుకోసం దాదాపు మూడు నెలల పాటు కసరత్తు చేసి, దేశ వ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన నిపుణులు, ఉద్యానవన అనుభవజ్ఞుల అభిప్రాయాలను పరిశీలించింది. ఇందుకోసం రూ.50కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో మెట్రో రైల్వే కారిడార్ మొత్తం గ్రీనరీతో నింపడానికి హైదరాబాద్ మెట్రో, ఎల్ అండ్ టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
