Home / SLIDER / రెండు విడ‌త‌లుగా..జిల్లాకు 16 వేల డబుల్ బెడ్రూంలు..మంత్రి తుమ్మ‌ల‌

రెండు విడ‌త‌లుగా..జిల్లాకు 16 వేల డబుల్ బెడ్రూంలు..మంత్రి తుమ్మ‌ల‌

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ త‌పిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌శంసించారు. అసెంబ్లీ లాబీలో గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వచ్చే డిసెంబర్ కల్లా ఖమ్మం జిల్లాలో మొదటి విడతగా మంజూరైన 6 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కానున్న‌ట్లు తెలిపారు. జిల్లాకు రెండు విడతలుగా 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు అయ్యాయ‌ని వివ‌రించారు. ఖమ్మంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాపీ మేస్త్రీలకు సైతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనుల కాంట్రాక్టులు అప్పగిస్తున్నామ‌ని మంత్రి తుమ్మల తెలిపారు.

తాపీ మేస్త్రీల‌కు పని అప్ప‌గించ‌డం వ‌ల్ల‌….వాళ్లకు పని దొరకడమే కాకుండా కొంత ఆదాయం కూడా సమకూరుతుందని మంత్రి తుమ్మ‌ల వివ‌రించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్లకు మార్జిన్ ఉండటం లేదనే వాదన అవాస్తవమ‌న్నారు. ఒక్కో డబుల్ బెడ్రూం నిర్మాణానికి గుత్తేదార్లకు ₹ 10 నుంచి 15 వేల ఆదాయం సమకూరుతోందని మంత్రి వివ‌రించారు. కాలనీ కాంట్రాక్టర్ కు ఐతే ₹ 2 నుంచి 3 లక్షల వరకు మిగులుతోందని చెప్పారు. రాష్ట్రంలో నిర్మించే జాతీయ రహదారుల కోసం సేకరించే భూమిని రాష్ట్ర చట్టం ప్రకారం సేకరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మల వెల్ల‌డించారు.