తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డంగా బుక్ చేశారు. టీడీపీని వీడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాననే ప్రకటిస్తున్న రేవంత్ నిజాలు దాస్తున్నారని ఎల్.రమణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రేవంత్ పదవికి రాజీనామా చేయలేదని, చంద్రబాబుకు ఆయన రాజీనామా ఇవ్వలేదని రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బాబుకు దండం పెట్టి వచ్చాడని వివరించారు. దారిలో పోతూ పోతూ ఎవరికి ఇచ్చాడో..తెలియదు కానీ…తమ నాయకునికి ఇచ్చాను అనడం అబద్దమని రమణ స్పష్టంచేశారు.
రేవంత్ చాలా పార్టీలు మారారని తెలిపిన రమణ…ఆయన వెళ్లినప్పుడల్ల ఆయా పార్టీలు బలహీన పడ్డాయా అని ఎద్దేవా చేశారు. రేవంత్ తన బలాన్ని అతిగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ స్థాయి నాయకుడి నుంచి కార్యకర్తకు పడిపొయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో కార్యకర్తనని ఆయనే చెప్పుకుంటున్నారని….ఆ పార్టీ కూడా అంతకుమించి గౌరవం ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పదవి ముగిసే సమయంలో రేవంత్ డ్రామాలు ఆడుతున్నారని రమణ ఎద్దేవా చేశారు.
త్వరలోనే కొడంగల్ లో సభ ఏర్పాటు చేస్తామని రమణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు ఎర్ర శేఖర్ అధ్యక్షతన పాలమూరులో పార్టీ బలంగా ఉందని రమణ పేర్కొన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి రాజీనామా గురించి అనుమానాలు వ్యక్తమవుతుండగా…తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని రమణ వెల్లడించారు.