తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మంథని టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు నర్సింగరావు దాదాపు ఇవాళ పదివేల మంది కార్యకర్తలతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీహార్-జార్ఖండ్ విడిపోయినపుడు లాలూ పార్టీ జార్ఖండ్‌లో ఉనికి కోల్పోయినట్లు తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. జ్యోతిబసు రికార్డును తిరగరాసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. చరిత్రలో కొన్ని మార్పులు అనివార్యంగా వస్తాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అస్థిత్వం కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని కేటీఆర్ అన్నారు.తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
