తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలో ప్రయోగాత్మకంగా 24గంటలు సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో ఆటో స్టార్టర్ల వల్ల ఉపయోగం లేకపోగా నష్టాలు ఉన్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా ఇవ్వగానే అన్ని వ్యవసాయ బోర్లు ఒక్కసారిగా పనిచేయడంతో స్థానిక ట్రాన్స్‌ఫార్మర్ మీద లోడు పడుతుందని తెలిపారు. దీంతో వచ్చే నెల ఆఖరుకు ఆటో స్టార్టర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది.ఈ క్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ మోటార్లకు అమర్చిన ఆటోస్టార్టర్లను తొలగించి రైతులకు ఆదర్శంగా నిలిచారు.ఆటో స్టార్టర్ స్థానంలో మంత్రి తుమ్మల మొబైల్ కంట్రోలర్‌ను అమర్చారు. దీని ద్వారా రైతు ఏ ప్రాంతంలో ఉన్నా తన ఫోన్ ద్వారా పంప్‌సెట్‌ను ఆన్, ఆఫ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.
