హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మరో శుభవార్త. ఎస్ఆర్ నగర్- మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకు సంబంధించి మెట్రోరైల్ భద్రతా కమిషనర్ (సీఎంఆర్ఎస్) అనుమతి లభించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ అనుమతి పత్రం జారీ చేశారు.
ఓ వైపు మెట్రో పనులు శరవేగంగా పూర్తవుతున్నా కీలకమైన భద్రతా పరమైన తనిఖీలు జరగకపోవడంతో అధికారుల్లో ఆందోళన ఉండేది. సీఎంఆర్ఎస్ ధ్రువపత్రం జారీ చేస్తే గానీ మెట్రో రైళ్లను నడిపేందుకు వీలు కాదు. తాజాగా ఆ అనుమతులు లభించడంతో ప్రారంభోత్సవానికి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగినట్లయ్యింది. మరోవైపు నాగోల్-మియాపూర్ మధ్య చిన్నపాటి పనులు మినహా మిగిలిన పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి.
ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు మెట్రోలోని రైల్వే సేఫ్టీ కమిషన్ వివిధ విభాగాలను పరిశీలించారు. సివిల్ వర్క్, ట్రాక్, వయాడక్, స్టేషన్స్, విద్యుత్, సిగ్నల్స్, ట్రైన్ కంట్రోల్, టెలీ కమ్యూనికేషన్, రోలింగ్ స్టాక్ తోపాటు ఇతర రైల్వే సిస్టమ్ మొత్తాన్ని పరిశీలించారు అధికారులు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని.. ప్రయాణికుల కోసం సర్వీసులు ప్రారంభించుకోవచ్చని తెలుపుతూ హైదరాబాద్ మెట్రో రైలుకి లేఖ విడుదల చేసింది.
కాగా, ఇప్పటికే నాగోల్ టూ మెట్టగూడ, మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ ఎప్పుడో అనుమతి వచ్చింది. ఇప్పుడు మాత్రం నాగోల్ టూ మియాపూర్ వయా అమీర్ పేట మీదుగా సర్వీసులు ప్రారంభించేందుకు సేఫ్టీ సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీంతో 30కిలోమీటర్ల మొత్తం దూరానికి మెట్రో రైలు సిద్ధం అయ్యింది. ప్రస్తుతం అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ దగ్గర చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నాయని.. మరికొన్ని రోజుల్లోనే వీటిని కంప్లీట్ చేస్తామని మెట్రో రైలు అధికారులు ప్రకటించారు.
Post Views: 260