సిద్దిపేటను పరిశ్రమల హబ్‌గా మారనుందని, సమగ్ర పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి జిల్లాల పారిశ్రామిక అభివృద్ధి, ఇండస్ట్రీయల్ క్లస్టర్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… రెండేళ్లలో సిద్దిపేట జిల్లా మీదుగా రైల్వేలైన్, జాతీయ రహదారులు రానున్న క్రమంలో పారిశ్రామిక వేత్తలకు ఏలాంటి ఇబ్బందులు ఉండవని, సిద్దిపేట జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడాలని ఇందుకు కావల్సిన సౌకర్యాలు, సదుపాయాలు, సహాకారం జిల్లా యంత్రాంగం కల్పిస్తుందన్నారు. వృద్ధి ఒకే వైపు కేంద్రీకృతం కాకుండా సిద్దిపేట, గజ్వేల్‌లో ప్లాస్టిక్ హౌసరి, పుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, హుస్నాబాద్, ముండ్రాయి, మందపల్లిలో రైస్‌మిల్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 10 చోట్ల పరిశ్రమల స్థాపన చేయనున్నట్టు మంత్రి తెలిపారు. సిద్దిపేట నియోజక వర్గంలోని చిన్నకోడూరు మండలంలోని మందపల్లి, నంగునూరు మండలంలోని ముండ్రాయిల్లో 270 ఎకరాల స్థలంలో ప్లాస్టిక్ హౌసరి, రైస్‌మిల్లులను, చిన్నకోడూరు మండలం జక్కాపూర్‌లో 100 ఎకరాల స్థలంలో ఆగ్రో పుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు, కొమురవెళ్ళి మండలం ఐనాపూర్, తపాస్‌పల్లిల్లో 1300 ఎకరాల్లో ఆగ్రో, పుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ పరిశ్రమల ఏర్పాటు, జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లిలో 200 ఎకరాల్లో మునిగడపలో 412 ఎకరాల్లో ఆగ్రో, పుడ్ ప్రాసెసింగ్, హుస్నాబాద్ మండలం జాలిగడ్డలో 100 ఎకరాల్లో రైస్ మిల్లులు, కొండపాక మండల కేంద్రంలో 41 ఎకరాల్లో, ములుగు మండలం కొట్యాలలో 102 ఎకరాల్లో ప్లాస్టిక్, రెడిమెడ్ గార్మెంట్స్ హౌసరి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
