ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చన్వెల్లిలో పాలీహౌజ్ రైతుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగం సంక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. జిల్లాలో 381 పాలిహౌజ్లకు రూ. 51 కోట్ల సబ్సిడీలు అందించినట్లు చెప్పారు. రైతులకు చేయూతనిచ్చే క్రమంలో భాగంగా ప్రతీ ఎకరాకు రూ. 8 వేలను పెట్టుబడి సాయంగా అందించనున్నట్లు చెప్పారు. రైతాంగం కోసం సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారన్నారు. అనంతరం మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. రైతు కొడుకు రైతు కావాలని కోరుకునే రోజులు రావాలన్నారు.రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నారు. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం 24 గంటల విద్యుత సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మద్దతు ధరలు అందిస్తున్నట్లు వెల్లడించారు. పంట దిగుబడులు పెరిగేలా రైతులకు పంటసాగుపై అవగాహన పెంచుతామని మంత్రి పేర్కొన్నారు.
