తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కేరాఫ్‌గా మారుతున్నది. ఏడాది పొడవునా ప్రపంచస్థాయి సదస్సులకు ఆతిథ్యం ఇచ్చే భాగ్యాన్ని సొంతం చేసుకున్నది. వాతావరణం, ఆతిథ్యం, భద్రత, వసతి, పర్యాటకం, సంస్కృతి, సంప్రదాయాలు తదితర పరిస్థితులు అనువుగా ఉండడంతో ఇక్కడ సదస్సుల నిర్వహణకు నిర్వాహకులు మొగ్గుచూపుతున్నారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు 150కి పైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక పాల్గొంటున్న నేపథ్యంలో హైదరాబాద్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది.
డిసెంబర్‌లో తెలుగు మహాసభలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా ప్రియులను ఆహ్వానించారు. దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశమున్నది.
జనవరిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనున్నది. 10 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, 15 వేల మంది ప్రతినిధులు, దేశంలోని వివిధ యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్లు హాజరుకానున్నారు. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
ఫిబ్రవరిలో మైనింగ్ టుడే-2018
ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ), ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మైనింగ్ టుడే 2018 పేరుతో సదస్సు నిర్వహించనున్నాయి. గనుల రంగంలో పేరొందిన వివిధ దేశాల ప్రతినిధులు, ప్రైవేట్ సంస్థలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు.
వరల్డ్ ఐటీ కాంగ్రెస్.. బయో ఏషియా
వచ్చే ఫిబ్రవరిలో రెండు అంతర్జాతీయ సదస్సులు జరుగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ జరుగనుండగా, 22 నుంచి 24 వరకు బయోఏషియా సదస్సు జరుగనున్నది.
మార్చిలో ఇండియా ఏవియేషన్..
పౌరవిమానయానశాఖ ఆధ్వర్యంలో జరిగే ఏవియేషన్‌షోకు హైదరాబాద్ మరోసారి వేదిక కానున్నది. మార్చి 14 నుంచి 18వ తేదీ వరకు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఈ షో జరుగనున్నది. హైదరాబాద్‌లో ఆరోసారి జరిగే ఈ ఏవియేషన్‌షోలో 200 కంపెనీలు తమ ఉత్పుత్తులను ప్రదర్శిస్తాయి.