తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పేరు వింటే ‘గొల్లభామ’ చీరెలు టక్కున గుర్తొస్తాయి. పాల కడవతో ఒయ్యారంగా నడచివెళ్లే గొల్లభామల బొమ్మలను చీరలోను, దాని అందమైన అంచుల్లోను రెండుదారాల అల్లిక పద్ధతిలో కలనేసి ఆకట్టుకునేలా ఉండే గొల్లభామ చేనేత చీరలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. ఈ చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు.
హైదరాబాద్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరిగే గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017 లో గొల్లభామ చీరలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇవాంకతో పాటు ఈ సదస్సుకు వచ్చే మహిళా ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ గొల్లభామ చీరలను బహుమానంగా ఇవ్వనున్నారు. ప్రపంచంలోని 150 దేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానుండగా.. వీరిలో దాదాపు సగం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలున్నారు. వీరందరికి గొల్లభామ చీరలను బహుమతిగా ఇవ్వడం ద్వారా వాటి ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.