తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని మోదీ ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇవాళ వరంగల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ అక్రమాల ద్వారా కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను నిస్సిగ్గుగా దోచుకున్నారే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి నీటి పారుదల శాఖను భ్రష్టు పట్టించారన్నారు.కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కాజీపేటను రైల్వే డివిజన్‌గా మారుస్తామని కడియం స్పష్టం చేశారు.ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 544 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1550 గురుకుల పాఠశాలల్లో 8లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని వివరించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి రూ.7కోట్లు కేటాయించామన్న కడియం.. వరంగల్ అభివృద్ధికి బడ్జెట్లో రూ.300కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.
