తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో భాగంగా రెండో రోజు బుధవారం పారిశ్రామికతలో మహిళల వాటా పెంచడంపై ప్లీనరీ చర్చాగోష్ఠిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరిస్తారు. ఇందులో ఇవాంక ట్రంప్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్ (బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ సతీమణి), డెల్ కంపెనీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కారెన్ క్యుంటోస్ పాల్గొంటారు. రెండోరోజు చర్చల్లో ప్రముఖ సినీనటులు రామ్‌చరణ్‌తేజ, సోనమ్‌కపూర్, ప్రముఖ క్రీడాకారులు సానియామీర్జా, పుల్లెల గోపీచంద్, మిథాలీరాజ్, సునీల్ గవాస్కర్ తదితరులు పాల్గొంటారు. సినిమా, క్రీడా, వైద్యరంగాలపై చర్చ జరుగుతుంది. ఐటీసీ గ్రూపు హెడ్ శివకుమార్ సూరంపూడి, అంకుర్ క్యాపిటల్ కోఫౌండర్ రితూవర్మ కిర్లోస్కర్ సిస్టమ్స్ చైర్‌పర్సన్, సెలబ్రిటి చెఫ్ వికాస్‌ఖన్నా, పేపాల్ ఉపాధ్యక్షురాలు లిసా మాథుర్, ఫిప్ల్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సచిన్ బన్సల్, ప్రథం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సీఈవో రుక్మిణి బెనర్జీ, ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభాసింగ్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సీవోవో ప్రియాంక చోప్రా, సంజీవ్ అగర్వాల్ పాల్గొంటారు.
