ఇచ్చిన సమయం మూడు నిముషాలే కావచ్చు. ఎదురుగా మహామహులు ఆసీనులు అయ్యారు. పదిహేను వందలమంది ప్రతినిధులతో పాటు దేశప్రధాని, కేంద్రమంత్రులు అందరిని మించి అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ప్రత్యేక ఆకర్షణలు అక్కడ. వారందరిముందు ఉపన్యసించే అవకాశం జన్మకో శివరాత్రిలా వస్తుంది. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న అదృష్టవంతుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు.
ఏమా ఉపన్యాసం! ఏమి భాషాజ్ఞానం!! ప్రతినిధులు అందరూ మంత్రముగ్ధులు అయ్యారు. హర్షధ్వానాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు చేస్తున్న కృషిని అరటిపండు వలిచి చేతిలోపెట్టినట్లు చెప్పేసారు. కేసీయార్ వాగ్ధాటి ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నది. పదిహేను రోజులలోగా అనుమతులు లిఖితపూర్వకంగా రాకపోతే అనుమతి ఇచ్చినట్లే భావించాలి అని కేసీయార్ చెప్పడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఏమైనా ఈ సదస్సు ద్వారా కేసీయార్ తన విశ్వరూపాన్ని మరోమారు ఆవిష్కరించారు అని చెప్పక తప్పదు. అంతర్జాతీయవేదికల మీద కేసీయార్ అద్భుతప్రసంగాలు చేయగలరని నిన్నటితో దేశానికి తెలిసింది.
అసలు సిసలైన పారిశ్రామికవేత్తల సదస్సులు ఎలా జరుగుతాయో నిన్నటి సదస్సు చూసి ఈ తరమువారు తెలుసుకోవాలి. సదస్సుకు హాజరైన పారిశ్రామిక శిఖరాలను చూసి హైదరాబాద్ పులకించిపోయింది. ఇంత పెద్ద సదస్సు జరిగినపుడు దాని ఫలితాలు కనిపించక మానవు.
సదస్సు విశేషాంశాలను చెప్పకుండా ఇవాన్క కోసం బిర్యానీ వండారు, కోడి కుర్మా చేశారు, మలాయి వండారు. మటన్ వంటకాలు చేశారు, సర్వర్లు నెలరోజుల ట్రైనింగ్ తీసుకున్నారు, డైనింగ్ టేబుల్ అంత పొడుగుంది, ఇంత పొడుగుంది లాంటి పనికిమాలిన చెత్త కబుర్లు ప్రసారం చేసి తమ స్థాయి ఎప్పటికీ గడ్డిపరక లాంటిదే అని మన తెలుగు ఛానెల్స్ మరోసారి గంటకొట్టి చాటుకున్నాయి.
ఈ సదస్సును నిర్వహించిన కేంద్రప్రభుత్వం, ఆతిధ్యం ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం ప్రశంసాపాత్రులు. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం యొక్క ఆవిరళకృషి ఫలప్రదమైంది.
సోర్స్ : ఇలపావులూరి మురళీ మోహన రావు గారు