ఓ దివ్యాంగురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని ప్రయత్నిస్తోంది. తమకు సాయం చేస్తోన్న మహానుభావుడితో ముచ్చటించాలని ఆరాటపడుతోంది. ఇంతకీ ఆమె ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తోంది..ఆమె ఎవరు అంటే..మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన దివ్యాంగురాలు స్వాతి
`నాలాంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌ను ఒకసారి కలువాలని ఉంది` అని వేడుకుంటోంది. నెలకు రూ.1500 పింఛన్ అందించి ఎంతోమంది దివ్యాంగులను ఆదుకుంటున్న కేసీఆర్ సార్ రుణం తీర్చుకోలేమని అంటున్నది.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామానికి చెందిన జగన్-దుర్గమ్మలకు ఇద్దరు అమ్మాయిలు స్వాతి, వసంత. ఇద్దరూ పుట్టుకతో వికలాంగులు. స్వాతి నడువలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న స్వాతి నిత్యం ఠంచన్‌గా స్కూల్‌కు వెళుతున్నది. వసంత 8వ తరగతి చదువుతున్నది. వసంతకి కూడా ఇలాంటి పరిస్థితే ఉండటంతో ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురవుతున్నాయని స్వాతి తండ్రి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే పింఛన్ డబ్బులు మందులకే సరిపోతున్నాయని.. ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
పింఛన్ డబ్బులు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపాలని ఉందని తన కూతురు స్వాతి చాలా సార్లు నాతో అంటుందని జగన్ తెలిపారు. అవకాశం వస్తే తన కూతురిని సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తానని విలేకరులతో చెప్పారు.