ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం.. ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడంతో ప్రత్యేకహోదా ఇక రాదని తేలిపోయింది. అయితే ఆంధ్రా ప్రజల ఆత్మాభిమానం అయిన ప్రత్యేక హోదాను ఇక హైలెట్ చేసుకుంటూ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రముఖంగా తెస్తున్నారు. దీన్ని బట్టి ఈపార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం సభను స్థంభింప చేసే అవకాశముంది. అంతేకాదు ప్రత్యేకహోదాపై ప్రయివేటు బిల్లుకూడా ఉండటంతో వైసీపీ ఎంపీలు విధిగా సభలకు హాజరుకావాలని ఆదేశించారు. దీనిపై స్పష్టత రాకుంటే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు జగన్ పార్టీ ఎంపీల రాజీనామాలపై ఇటీవల తరచూ చంద్రబాబు పదే పదే ప్రశ్నిస్తుండటం కూడా ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది. దీంతో జగన్ ఇక రాజీనామాలకే సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయించాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటం, పాదయాత్రలో తాను మరో ఏడునెలల పాటు ఉండటం వల్ల ఇక అసెంబ్లీకి కూడా వెళ్లేది లేదని, అందువల్ల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల రాజీనామా విషయంపై త్వరలోనే వారితో సమావేశం కావాలని కూడా నిశ్చయించారు. అయితే రాజీనామాలకు ఎమ్మెల్యేలు అధికశాతం మంది సుముఖత వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం ఎంపీలు రాజీనామా చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఫైనల్‌గా జగన్ డిసిషన్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.