రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నఇవాళ అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చాందా వద్ద చనాకా కొరాటా బ్యారేజీ కాల్వల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చనాకా కొరాటా బ్యారేజీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనులను గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ బ్యారేజీ నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్, బేల మండలాలు, బోథ్ నియోజకవర్గంలోని తాంసి, తలమడుగు మండలాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 51 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బ్యారేజీ నిర్మాణ పనులకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
