రాష్ట్రంలోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపడుతోంది. కీలకమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులు అన్నింటిలోనూ రోగుల పడకల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో కొత్తగా 8,500 పడకల పెంపునకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెద్దాసుపత్రులైన ఉస్మానియా, గాంధీల్లో 2,000 చొప్పున పడకలను పెంచనున్నారు.ఈ నేపధ్యంలో వరంగల్ ఎంజీఎంలో 1,500, నిలోఫర్‌లో 1,000 చొప్పున పడకలను పెంచేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పడకల పెంపు పనులు జరగనున్నాయి. మారుతున్న జీవనశైలి, ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.
