రాబోయే రోజుల్లో బీసీలు గౌరవంగా బతకాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అటవీ, బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు .రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడున్నరేళ్ల కాలంలో అట్టడుగు వర్గాలను గుర్తించి సీఎం ఆదుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు. కానీ వారి అభివృద్ధి గురించి పట్టించుకున్న వారెవరూ లేరని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని అటవీ, బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.